: భారత విద్యార్థులు స్మార్ట్... వారు ఉండాల్సిందే: ట్రంప్ భారత అనుకూల వ్యాఖ్యలు
తనపై పెరుగుతున్న వ్యతిరేకతను చూసి నష్ట నివారణాయత్నాల్లో పడ్డారు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్ విద్యాలయాల్లో చదివేందుకు వచ్చే భారత విద్యార్థులను వెనక్కి పంపరాదని అన్నారు. భారత విద్యార్థులు 'స్మార్ట్' అని వ్యాఖ్యానించిన ఆయన, అమెరికాకు వారి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. "మనకు నచ్చినా, నచ్చకున్నా వారు డబ్బు చెల్లించి వస్తున్నారు. వారు తెలివైన వారు. వారికి మనం విద్యను అందిస్తున్నాం. అలాంటి వారు మన దేశంలో ఉండాలి. వారిని వెనక్కు పంపితే మనకే నష్టం" అని ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. "వారిని ఇక్కడకు రానివ్వకుంటే... మీకు తెలుసా? హార్వార్డ్ కు వెళతారు. వారి తరగతుల్లో వారు విద్యార్జనలో రాణించిన వారు. తిరిగి ఇండియాకు వెళితే, కంపెనీలు పెడతారు. మరింత మందికి ఉద్యోగాలను కల్పిస్తారు. కొంత మంది ఇక్కడే ఉండాలని అనుకుంటారు. అలా చేస్తున్నారు కూడా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉన్నవారిని వెళ్లగొట్టడం భావ్యం కాదు" అని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. గతంలో ఇమిగ్రేషన్ విధానంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలైన సంగతి తెలిసిందే.