: తాగిన మిత్రులను విడిపించుకునేందుకు పోలీస్ స్టేషన్ లో యువతి వీరంగం


మద్యం మత్తు తలకెక్కిన ఓ యువతి పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించింది. ఈ ఘటనలో ఆ యువతి స్టేషన్లోని కంప్యూటర్, ఇతర పరికరాలను ఎత్తిపడేయడమే కాక, అక్కడి ఖాకీలపై అచ్చ తెలుగులోనే తిట్ల దండకం అందుకుంది. అసలే మహిళ, ఆపై మద్యం మత్తులో ఉందాయే. పోలీసులు కూడా నోరెత్తడానికే జంకారు. ఈ ఘటన హైదరాబాదులోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఇటీవలే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకెళితే... మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న వారి ఇద్దరు మిత్రులు స్టేషన్ కు వచ్చారు. పట్టుబడ్డ యువకులకు మద్దతుగా స్టేషన్ కు వచ్చిన ఇద్దరిలో ఓ యువతి కూడా ఉంది. వచ్చీరాగానే తన మిత్రులను వదిలేయాలని పోలీసులకు ఆమె ఆర్డర్స్ జారీ చేసింది. అయితే డ్రంకన్ డ్రైవ్ కింద కేసు పెట్టామన్న పోలీసులు అందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది. పోలీసులపై తిట్ల దండకం అందుకుంటూనే అక్కడి సామగ్రిపై ప్రతాపం చూపింది. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడి ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్ లో రికార్డు చేశాడు. నిమిషాని కంటే కాస్తంత ఎక్కువ నిడివి కలిగిన ఈ వీడియో నేషనల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News