: ‘హోదా’పై కాంగ్రెస్, టీడీపీ మధ్య వాగ్వాదం!... అన్యాయం చేసింది కాంగ్రెస్సేనన్న సీఎం రమేశ్
ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల అంశం... చిరకాల ప్రత్యర్థులు కాంగ్రెస్, టీడీపీల మధ్య పెద్దల సభ రాజ్యసభలో మాటల యుద్ధానికి తెర తీసింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నేటి సమావేశాల్లో భాగంగా అటు లోక్ సభతో పాటు ఇటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ నోటీసులు ఇచ్చింది. ఈ అంశంపై పెద్దల సభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్, ఆ పార్టీ ఎంపీలు కేవీపీ రామచంద్రారావు, జేడీ శీలం తదితరులు బీజేపీ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాను ఐదేళ్ల పాటు ఇస్తామని తాము ప్రతిపాదించగా, పదేళ్ల పాటు ఇవ్వాలని నాటి బీజేపీ ఎంపీ, ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు డిమాండ్ చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసుపై మాట్లాడిన టీడీపీ ఎంపీ సీఎం రమేశ్... కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. విభజనతో ఏపీ అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం రమేశ్... ఆ పాపమంతా కాంగ్రెస్ దేనని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రస్తుతం కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడుతోందని ఆయన విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులతో సీఎం రమేశ్ వాగ్వాదానికి దిగారు.