: 'కల్చర్' ముగిసింది... టన్నుల కొద్దీ కాలుష్యం మిగిలింది!


ఢిల్లీలోని యమునా నదీ తీరంలో వైభవంగా జరిగిన 'వరల్డ్ కల్చర్ ఫెస్టివల్' ముగియగా, ఆ ప్రాంతంలో వందల టన్నుల చెత్త మిగిలింది. దాదాపు 30 లక్షల మంది దేశ విదేశీ అతిధులు ఈ కార్యక్రమానికి రాగా, వారందరూ తిని పారేసిన ప్లేట్ల నుంచి తాగి పారేసిన ప్లాస్టిక్ సీసాలు, కూల్ డ్రింక్ క్యాన్లు, సెట్టింగ్స్ కోసం వాడిన మోల్డింగ్స్ వ్యర్థాలు తదితరాలతో యమునా తీరం నిండిపోయింది. ఇక, ఈ మెగా ఈవెంట్ అనంతరం యమునా నదికి ఏ మేరకు నష్టం వాటిల్లిందన్న విషయాన్ని తేల్చేందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అధికారులు కార్యక్రమం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. మూడు రోజుల పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక సదస్సు ఆదివారంతో ముగియగా, పర్యావరణానికి, యమునా నదీ తీరానికీ తీవ్ర ముప్పు కలిగిందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యమునా నది సహజ వరద మార్గానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, నదిలోని టన్నుల కొద్దీ చెత్త కారణంగా, వరద సంభవిస్తే పెను ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. కాగా, యమునా నదికి కలిగిన నష్టాన్ని నివారించేందుకు రూ. 5 కోట్లను చెల్లించేందుకు ఒప్పుకున్న ఏఓఎల్, ఇప్పటి వరకూ రూ. 25 లక్షలను మాత్రమే ఢిల్లీ నగరపాలక అధికారులకు చెల్లించింది.

  • Loading...

More Telugu News