: గొల్లపూడి ప్రమాదంపై విచారణ... ‘ధనుంజయ’పై కఠిన చర్యలు: టీఎస్ మంత్రి లక్ష్మారెడ్డి
కృష్ణా జిల్లా గొల్లపూడి వద్ద నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో 31 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న లక్ష్మారెడ్డి నేటి తెల్లవారుజామున హైదరాబాదు నుంచి బయలుదేరి గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆయన విద్యార్థులను ఆరా తీశారు. ఆ తర్వాత అక్కడే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. ప్రమాదానికి కారణమైన ధనుంజయ ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మెడికోలకు అయ్యే వైద్య ఖర్చులన్నింటినీ తమ ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన చెప్పారు.