: నా పౌరసత్వం అంశాన్ని డీల్ చేస్తాం: రాహుల్ గాంధీ
బ్రిటన్ లో గతంలో ఓ కంపెనీని ఏర్పాటు చేసిన సందర్భంగా తాను బ్రిటిష్ పౌరుడినేనని పేర్కొన్న అంశంపై సమాధానమివ్వాలంటూ లోక్ సభ ఎథిక్స్ కమిటీ జారీ చేసిన నోటీసు నేపథ్యంలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ స్పందించారు. తాము ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పార్లమెంటు బయట మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 'ఈ అంశాన్ని డీల్ చేస్తాం' అని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ కూడా ఈ విషయమై రాహుల్ స్పష్టత ఇవ్వాలని అన్నారు. రాహుల్ గాంధీ ఏ దేశ పౌరుడో స్పష్టత తెచ్చుకోవాలన్నారు. ఒకవేళ ఈ విషయమై రాహుల్ కే స్పష్టత లేకపోతే దానిలో ఏదో మతలబు ఉండి ఉంటుందన్నారు. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నోటీసుపై తప్పక స్పందించాలని అన్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి గత ఏడాది నవంబరులో ఈ విషయంపై మోదీకి లేఖ రాయడం జరిగింది. అనంతరం తూర్పు ఢిల్లీ పార్లమెంటు సభ్యుడు మహేశ్ గిరి ఇదే విషయంపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఫిర్యాదు చేశారు. పర్యవసానంగా ఈ విషయాన్ని విచారించాల్సిందిగా అద్వానీ నేతృత్వంలోని లోక్ సభ ఎథిక్స్ కమిటీకి స్పీకర్ పంపించడం జరిగింది.