: దమ్ముంటే.. నా సవాల్ ను స్వీకరించండి: ప్రతిపక్ష నేతతో సీఎం చంద్రబాబు
‘వీటీపీఎస్, కృష్ణపట్నం కొత్త యూనిట్, భూముల విషయంలో చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను అసెంబ్లీకి రాను. నిరూపించకపోతే మీరు కూడా ఆ పని చేయగలరా?’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటీపీఎస్ అంశం కోర్టు పరిధిలో ఉంది కనుక, దీనిని పక్కనపెట్టి మిగతా ఆరోపణలనైనా నిరూపించుకోవాలని, ఆరోపణలు నిరూపించకుంటే జగన్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఈ హౌస్ లో సభాసంప్రదాయాలు లేవు, ఇష్టానుసారం ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నారని, నిబంధనలు పాటించడం లేదని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్సీపీ చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలని, చేసిన ఆరోపణలకు ముందు సమాధానాలు చెప్పి చర్చ కొనసాగించాలని బాబు అన్నారు.