: మా అమ్మ పుట్టి పెరిగిన ఇంటిని కొనుగోలు చేస్తా: అమీర్ ఖాన్
తన పుట్టినరోజుకు ఎటువంటి కానుకలు వద్దని, అయితే, ఈ సందర్భంగా తన తల్లి పుట్టి పెరిగిన ఇంటిని కొనుక్కోవాలనుకుంటున్నానని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చెప్పాడు. ఈరోజు అమీర్ తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. తన తల్లి జీనత్ హుస్సేన్ వారణాసిలో పుట్టి పెరిగిందని, ఆమె నివసించిన ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఆ ఇంట్లో నివసిన్తున్న వారితో మాట్లాడతానని, వారిని ఒప్పించి ఈ ఏడాదిలో ఆ ఇంటిని కొంటానని చెప్పాడు. ఈ సందర్భంగా మరో సరదా వ్యాఖ్య కూడా అమీర్ చేశాడు. తనకి సంతోషాన్నిచ్చే మరో కానుక ‘నిద్రే’నని అమీర్ అన్నాడు. ఖాళీ దొరికితే హాయిగా నిద్రపోతానని అన్నాడు. కాగా, అమీర్ పుట్టిన రోజు సందర్భంగా భార్య కిరణ్ రావు, కుమారుడు ఆజాద్ ఖాన్, పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.