: ఆధార్ బిల్లుపై కేంద్రం చదరంగం... కాంగ్రెస్ కు చెక్ మేట్!
విపక్షాల వాదనను పట్టించుకోకుండా, తమకు బలమున్న లోక్ సభలో ఆధార్ బిల్లును 'మనీ బిల్లు'గా ఆమోదింపజేసుకున్న ఎన్డీయే సర్కారు బలంలేని రాజ్యసభకు వచ్చేసరికి గేమ్ ప్లాన్ మార్చింది. ఈ బిల్లును చర్చించేందుకు మరో రెండు రోజుల పాటు రాజ్యసభ సమావేశాలను పొడిగించాలని కాంగ్రెస్ చేసిన డిమాండును తోసిపుచ్చింది. వాస్తవానికి బుధవారంతో వాయిదా పడే రాజ్యసభ తిరిగి మార్చి 16నే సమావేశమవుతుంది. ఈ విషయాన్ని ముందే గుర్తెరిగిన బీజేపీ, ఆధార్ బిల్లు కోసం వేసిన ఎత్తుతో కాంగ్రెస్ కు 'చెక్ మేట్' పడింది. ఒకసారి మనీ బిల్లు రూపంలో లోక్ సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ తప్పనిసరిగా రెండు వారాల్లోపు చర్చించాలి. ఒకవేళ చర్చ జరగకుంటే, ఆ బిల్లు పాసై పోయినట్టే లెక్క. పైగా మనీ బిల్లు రూపంలో వచ్చిన దాన్ని కేవలం చర్చించడమే తప్ప, మార్పు చేర్పులతో తిరిగి లోక్ సభకు పంపే అవకాశాలు ఉండవు. అయితే, కాంగ్రెస్ తదితర విపక్షాలు తమ అభ్యంతరాలను రికార్డు చేయించాలని చూశాయి. కేంద్రం దానికి కూడా అవకాశం ఇచ్చేట్టు కనిపించడం లేదు. గత శుక్రవారం లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు నేడు రాజ్యసభకు వచ్చింది. ఇక సమావేశాలు మరో రెండు రోజులు మాత్రమే జరగనున్నాయి. ఇందులో ఒక రోజు పదవీ విరమణ చేయనున్న సభ్యులకు వీడ్కోలుగా, వారి ప్రసంగాలకే సరిపోతుంది. ఆపై రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ లపై చర్చలు జరగాల్సి వుంది. దీంతో ఆధార్ బిల్లును చర్చించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమయం సరిపోయే అవకాశాలు లేవు. దీంతో కనీసం కాంగ్రెస్ కు ఈ బిల్లుపై అభ్యంతరాలను సైతం వ్యక్తం చేసే అవకాశం లేకుండా పోనుంది.