: 150 కోట్ల మందిలో ఉగ్రవాదులు లక్ష మందేనా? కాదు... 40 కోట్ల మంది ఉంటారు: మళ్లీ నోటికి పనిచెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున ఫ్రంట్ రన్నర్ గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈ సారి కూడా ఆయన ముస్లింలనే టార్గెట్ చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ సర్వే వివరాలను చూపుతూ 'ఫాక్స్ న్యూస్' వార్తా సంస్థ అడిగిన ప్రశ్నపై విరుచుకుపడ్డారు. ప్రపంచంలో 150 కోట్ల మంది ముస్లింలు ఉండగా, కేవలం లక్ష మంది మాత్రమే ఉగ్రవాదులుగా మారి జీహాద్ పేరిట ఆయుధాలు పట్టుకున్నారన్న సర్వేను ఆయన ముందు ప్రస్తావించగా... "ఎవరు చెప్పారు? 150 కోట్ల మందిలో లక్ష మంది ఉగ్రవాదులేనని? ఈ సర్వే తప్పు. కనీసం 27 శాతం మంది లేదా 35 శాతం మంది ముస్లింలు ఉగ్ర ఆలోచనల్లో ఉన్నవారే. అసలు సంఖ్య మరింతగా ఉండొచ్చు కూడా" అని అన్నారు. కనీసం 40 కోట్ల మంది ముస్లింలు ఉగ్రవాదులేనని, అమెరికాను ఇస్లాం ద్వేషిస్తోందని ఆరోపించారు. "ప్రతి ఒక్కరూ అమెరికాను ప్రేమిస్తారని సులువుగానే చెప్పవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి వేరు. సమస్య చాలా పెద్దది, ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచమంతటా విస్తరిస్తోంది" అన్నారు. మద్య ప్రాచ్య దేశాల్లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను సమూలంగా తుడిచిపెట్టాలంటే, 20 నుంచి 30 వేల మంది సుశిక్షితులైన సైనికులు అవసరమని భావిస్తున్నట్టు తెలిపారు. "ప్రస్తుతం తలలు నరుకుతూ, ఉక్కు బోనుల్లో పదుల కొద్దీ ప్రజలను బంధించి వినోదం చూస్తున్న పైశాచికులను చూస్తున్నాం. మనం ఏదైనా చేయాలి. అందుకు తగ్గ ఆయుధ శక్తి మనకుంది. వాళ్లు కూడా ఆయుధాల కోసం చూస్తున్నారు. ఒకవేళ వారికి మరిన్ని ఆయుధాలు దొరికితే, మన దేశం పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వుంటుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.