: టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడి హఠాన్మరణం... నివాళి అర్పించిన చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి తీరని లోటు ఏర్పడింది. ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని జిల్లాలో పార్టీ పటిష్ఠతకు అలుపెరగని కృషి చేసిన జిల్లా అధ్యక్షుడు పర్వత శ్రీసత్యనారాయణమూర్తి అలియాస్ చిట్టిబాబు నిన్న హఠాత్తుగా కన్నుమూశారు. అప్పటిదాకా చలాకీగానే ఉన్న ఆయన రెండు రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురై కాకినాడలోని తన స్వగృహానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నిన్న గుండెపోటుకు గురైన ఆయన కాకినాడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఉదయం 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. పర్వత మృతి వార్త తెలియగానే పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. లండన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు... అటు నుంచి అటే కాకినాడకు వెళ్లారు. పర్వత భౌతిక కాయానికి నివాళి అర్పించిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పర్వత మృతితో జిల్లాలో టీడీపీకి తీరని లోటు ఏర్పడిందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతరం నిన్న సాయంత్రానికే పర్వత అంత్యక్రియలు ముగిశాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పర్వత, జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.