: ఎల్లో ఫీవర్... చైనాలో తొలి కేసు నమోదు
చైనా దేశంలో తొలి ఎల్లో ఫీవర్ కేసు నమోదైనట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య, కుటుంబ నియంత్రణ కమిషన్ వెల్లడించింది. తూర్పు జిజియాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఒక వ్యక్తి (32) ఈ వ్యాధి బారిన పడ్డాడని, ఆ వ్యాధి మొదటి దశలో ఉందని అధికారులు చెప్పారు. ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆఫ్రికాలోని అంగోలాలో ఇన్ఫెక్షన్ బారిన పడిన ఆ వ్యక్తిని చైనా రాజధాని బీజింగ్ లో పరీక్షించడంతో ఈ పరీక్షల్లో అతనికి ఎల్లో ఫీవర్ ఉన్నట్లు తేలింది. కాగా, దోమలు కుట్టడం ద్వారా వ్యాపించే ఎల్లో ఫీవర్ వ్యాధి ఆఫ్రికా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలో విస్తరించి ఉంది.