: వాడు ఉగ్రవాది, జైల్లో పెట్టాలి: నిరసన తెలిపిన అమెరికన్ పై ట్రంప్ ఆగ్రహం
తన ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెల్పబోయిన అమెరికన్ పై అధ్యక్ష పదవికి బరిలోకి దిగాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకున్నాడు. ఓ వ్యక్తి ట్రంప్ ప్రచార సభలో బారికేడ్లు దూకి ట్రంప్ సమీపానికి రాబోగా, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం తన ప్రసంగంలో "నేను చాలా క్రూరుడిని. అందుకే ఉగ్రవాదం విషయంలో చాలా కఠినంగా ఉన్నాను. ఆ వ్యక్తికి దేశంపై ప్రేమ లేదు. ఉగ్రవాది అయి ఉండొచ్చు. ఐఎస్ఐఎస్ మద్దతుదారైనా కావచ్చు. అతన్ని జైల్లో పెట్టాలి. ఈ దిశగా మన కోర్టులు అంత తేలికగా వదలవనే అనుకుంటున్నా" అన్నారు. కాగా, ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ముందుగా సమర్థించిన పలువురు రిపబ్లికన్ సెనెటర్లు, ఇప్పుడాయన్ను వ్యతిరేకిస్తున్నారు. ఆయనపై పలు ప్రాంతాల్లో వ్యతిరేకత పెరుగుతుండటం ఇప్పుడు ట్రంప్ శిబిరాన్ని ఆందోళనలో పడేస్తోంది.