: కోల్ కతాలో అడుగుపెట్టిన పాక్ క్రికెట్ జట్టు
పటిష్ట భద్రత కల్పిస్తామన్న హామీ మేరకు పాక్ క్రికెట్ జట్టు భారత్ కు చేరుకుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈరోజు కోల్ కతాలో అడుగుపెట్టింది. 27 మంది సభ్యులు ఉన్న పాక్ బృందం లాహోర్ నుంచి అబుదాబి మీదుగా కోల్ కతా చేరుకుంది. పాక్ బృందంలో 15 మంది ఆటగాళ్లు, 12 మంది అధికారులు ఉన్నారు. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ నెల 19న భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. కాగా, టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు పాల్గొనే విషయమై ఎడతెగని ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. భారత్ లో తమ క్రీడాకారులకు భద్రత విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే, ఎటువంటి ఇబ్బంది ఉండదని, పూర్తి భద్రత కల్పిస్తామని బీసీసీఐ అధికారులు హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు పాక్ జట్టు కదిలి వచ్చింది.