: యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ‘జనసేన’ సభ్యుడి అరెస్టు


ఒక యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు జనసేన పార్టీ సభ్యుడు చంద్రశేఖర్ సాకేటిని సీసీఎస్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్టణానికి చెందిన చంద్రశేఖర్ వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అక్కడే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన ఒక అమ్మాయితో ఫేస్ బుక్ పరిచయం ఏర్పడింది. క్రమంగా వారి మధ్య స్నేహం కుదిరింది. చంద్రశేఖర్ హైదాబాద్ వచ్చిన ప్రతిసారి ఆ అమ్మాయిని తనను కలవమని చెబుతుండేవాడు. మొదట్లో ఆమె అందుకు నిరాకరించినప్పటికీ, ఆ తర్వాత ఒకటి రెండుసార్లు అతన్ని కలిసింది. దీంతో వారి మధ్య చనువు పెరిగింది. దీనిని అవకాశంగా తీసుకున్న అతను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అందుకు నిరాకరించిన ఆమె అతనితో మాట్లాడటం మానేసింది. దీంతో, చంద్రశేఖర్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఆ యువతి తనను కలిసినప్పుడు రహస్యంగా తీసిన ఫొటోలను, వారి చాటింగ్ మెస్సేజ్ లతో పాటు అసభ్యకరమైన కామెంట్లను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో కలత చెందిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చంద్రశేఖర్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News