: అన్నవరం ‘అపచారం’పై క్విక్ రియాక్షన్!... ఉద్యోగులపై వేటు, పెళ్లి బృందానికి నోటీసులు
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఆవరణలో నిన్న రాత్రి చోటుచేసుకున్న అశ్లీల నృత్యాలపై ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. సత్యదేవుడి ఆశీస్సులతో పెళ్లి జరిపిద్దామని వచ్చిన ఓ బృందం పెళ్లి తంతులో భాగంగా ఆలయ ఆవరణలోనే రికార్డింగ్ డ్యాన్స్ ల పేరిట అశ్లీల నృత్యాలు చేసింది. ఈ దృశ్యాలు నేటి ఉదయం న్యూస్ చానెళ్లలో ప్రసారం కావడంతో వేగంగా స్పందించిన ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. అదే సమయంలో తప్ప తాగి మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించిన పెళ్లి బృందానికి నోటీసులు జారీ చేశారు. పెళ్లి బృందం ఇచ్చే వివరణ ఆధారంగా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.