: ఉద్యోగాల భర్తీపై లొల్లి!... అసెంబ్లీలో ఈటల, ఉత్తమ్ మధ్య వాగ్వాదం!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేటి ఉదయం ప్రారంభమైన సభలో ఉద్యోగాల భర్తీపై వివాదం రేగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అంశాన్ని ప్రస్తావించారు. లక్ష ఉద్యోగాలంటూ టీఆర్ఎస్ ఎన్నికల సమయాన ఊదరగొట్టి, ప్రస్తుతం చేతులు ముడుచుకుని కూర్చుందని ఆయన ఆరోపించారు. దీంతో స్పందించిన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమధానమిస్తూ... ఇప్పటికే పలు కేటగిరీల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని, ప్రస్తుతం ఆయా విభాగాల కింద ఉద్యోగాల భర్తీ కొనసాగుతోందని చెప్పారు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు రానున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో ఈటల ప్రసంగానికి అడ్డు తగిలిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... ప్రభుత్వం లెక్కలు చెబుతున్న మాదిరిగా ఉద్యోగాల భర్తీ జరగడం లేదని ఆరోపించారు. ఉత్తమ్ ఆరోపణలకు ఘాటుగా స్పందించిన ఈటల... ఓ పక్క ఉద్యోగ ఖాళీల భర్తీ వేగంగా కొనసాగుతున్నా, విపక్షం పసలేని వాదన చేస్తోందని, ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు గుప్పిస్తోందని విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.