: ‘హోదా’ కోసం కాంగ్రెస్ పోరుబాట!... ఆందోళన కోసం ఢిల్లీ బయలుదేరిన రఘువీరా బృందం
ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పోరు బాట పట్టింది. ఇప్పటికే పలు రీతుల్లో ఆందోళనలు చేపట్టిన ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి తాజాగా ఢిల్లీ వేదికగా వరుస నిరసనలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అధిష్ఠానం మార్గదర్శకత్వంలో ఈ నెల 14నుంచి ఢిల్లీలో మొదలు కానున్న ఈ ఆందోళనలు 16 దాకా కొనసాగనున్నాయి. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రఘువీరారెడ్డి పార్టీ నేతలతో కలిసి విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు వెంటరాగా కొద్దిసేపటి క్రితం విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చిన ఆయన అక్కడ ఏపీ ఎక్స్ ప్రెస్ ను ఎక్కారు. రైలు ఎక్కే ముందు అక్కడి మీడియాతో మాట్లాడిన సందర్భంగా రఘువీరా తన ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. మూడు రోజుల పాటు ఆందోళనలు చేపట్టేందుకే ఢిల్లీ వెళుతున్నప్పటికీ... రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రప్రభుత్వ పెద్దలకు తెలిపేందుకు యత్నిస్తామన్నారు. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అవుతామని ఆయన చెప్పారు. తాము చేపట్టనున్న ఆందోళనల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు కూడా పాలుపంచుకుంటారని ఆయన చెప్పారు.