: యూనివర్శిటీల్లో దేశ వ్యతిరేకుల పట్ల జాగ్రత్త: ఆర్ఎస్ఎస్
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) లో దేశ వ్యతిరేక నినాదాలను ఖండిస్తూ.. వర్శిటీల్లో దేశ వ్యతిరేకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మాల్దా హింసాకాండ పట్ల కూడా ఆర్ఎస్ఎస్ స్పందించింది. దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆర్ఎస్ఎస్ ఉద్ఘాటించింది. రాజకీయ పార్టీలు తమ విధానాన్ని పక్కనపెట్టి ఇటువంటి సంఘటన పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది. ఉదాసీనత ప్రదర్శించరాదని కోరింది. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ ఈ రోజు రాజస్థాన్ లోని నాగౌర్‌లో ప్రారంభమైంది. విద్యావ్యవస్థ, సాంఘిక సమానత్వం, కులవివక్ష వంటి అంశాలపై ఈ సభలో చర్చించనుంది. అలాగే ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆర్ఎస్ఎస్ యూనిఫారంను మార్చే అంశంపై కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది.