: విజయ్‌మాల్యా జెంటిల్ మ్యాన్.. మోసగాడు కాదు: ఫరూఖ్ అబ్దుల్లా
తనపై మీడియా చేసిన ఆరోపణలను ఖండిస్తూ, ట్విట్టర్ వేదికగా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత విజయ్‌మాల్యాకు తన మాజీ పార్లమెంట్ సహచరుడు ఫరూఖ్ అబ్దుల్లా నుంచి సపోర్ట్ లభించింది. విజయ్‌మాల్యా ఒక జంటిల్ మ్యాన్, నిజాయతీపరుడని ఆయన కితాబు ఇచ్చారు. ఐడీబీఐలో రుణం తీసుకుని మోసం చేసిన కేసులో కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ మాజీ ఛైర్మన్ విజయ్‌మాల్యా ఉదంతంపై పార్లమెంట్లో పాలక, ప్రతిపక్షాల మధ్య వాదనలు కూడా జరిగాయి. అయితే, ఫరూఖ్ అబ్దుల్లా విజయ్ మాల్యాను గురించి మీడియాతో మాట్లాడుతూ.. విజయ్‌మాల్యా ఓ జెంటిల్ మ్యాన్ అని, త్వరలోనే తనపై వస్తోన్న ఆరోపణలకు సమాధానం ఇస్తాడని అన్నారు. ప్రభుత్వం మాల్యాను విచారణకు ఆహ్వానిస్తే తప్పక వస్తాడని వ్యాఖ్యానించారు. ఎయిర్‌లైన్స్ ను సమర్థవంతంగా మొదలుపెట్టిన ఆయనకు దురదృష్టవశాత్తూ నష్టాలు వచ్చిపడ్డాయని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. విజయ్‌మాల్యా, ఫరూఖ్ అబ్దుల్లా ఒకప్పుడు రాజ్యసభలో సహచరులు. 2005లో ప్రవేశపెట్టిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాల్యాకు అపకీర్తిని మూటకట్టింది. నష్టాల్లో కూరుకుపోయిన ఆ కంపెనీ.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. బ్యాంకుల్లో తీసుకున్న బిలియన్ డాలర్ల (7 వేల కోట్లు రూపాయలు) లోన్ మాల్యా మెడకు చుట్టుకుంది. ఆయన్ని దేశం దాటిపోకుండా నిలువరించాలని బ్యాంకులన్నీ సుప్రీంకోర్టులో కేసు వేశాయి. అయితే, అప్పటికే దేశం వదిలి వెళ్లిన ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు కూడా జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన కేసులో నిందితుడిగా ఉన్న మాల్యా దేశం విడిచి వెళ్లారంటూ వస్తున్న వార్తలపై శుక్రవారం ఉదయం ఆయన స్పందించిన విషయం తెలిసిందే. దీంతో ఫరూఖ్ అబ్దుల్లా ఆయనకు అండగా ఈ వ్యాఖ్యలు చేశారు.