: తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాల్లో మార్కెట్!
సెషన్ ఆరంభంలో క్రితం ముగింపు వద్దే ఉన్న బెంచ్ మార్క్ సూచికలు ఆపై గంట వ్యవధిలోనే భారీ లాభాల దిశగా సాగినప్పటికీ, ఓ వైపు కొనుగోళ్లు, మరోవైపు అమ్మకాలు వెల్లువెత్తిన వేళ, తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలు నమోదయ్యాయి. యూరప్ మార్కెట్ల అనిశ్చితి సెన్సెక్స్, నిఫ్టీలపై కనిపించిందని మార్కెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 94.65 పాయింట్లు పెరిగి 0.38 శాతం లాభంతో 24,717.99 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 24.05 పాయింట్లు పెరిగి 0.32 శాతం లాభంతో 7,510.20 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.08 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.16 శాతం నష్టపోయింది. ఎన్ఎస్ఈ-50లో 27 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. కెయిర్న్ ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ పోర్ట్స్, లుపిన్, జడ్ఈఈఎల్ తదితర కంపెనీలు లాభపడగా, ఐడియా, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,725 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,100 కంపెనీలు లాభాల్లోను, 1,464 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. గురువారం నాడు రూ. 91,64,974 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 91,82,859 కోట్లకు పెరిగింది.