: వెంకన్నకు తలనీలాలు సమర్పించుకున్న రఘువీరారెడ్డి... ‘హోదా’ కోసం రేపు ఢిల్లీకి పయనం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి నిన్నటిదాకా మాసిన గడ్డం, నెరసిన జుట్టుతో కనిపించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ నున్నటి షేవింగ్ తో చాలా నీటుగా కనిపించే రఘువీరా గడ్డం పెంచడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే మొక్కు నేపథ్యంలోనే ఆయన గడ్డం అలా పెంచేశారని ఆ చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఆ మొక్కు ఏ దేవుడికి అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో నిన్న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లిన రఘువీరా మొక్కు తీర్చుకున్నారు. తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించిన ఆయన మనవరాలిని చంకనేసుకుని నున్నటి గుండుతో ఆలయం ముందు ప్రత్యక్షమయ్యారు. చిరునవ్వులు చిందించిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగించనున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 12న ఢిల్లీకి పయనం కానున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14 నుంచి 16 దాకా ఢిల్లీలో చేపట్టనున్న దీక్షల్లో పార్టీ అగ్ర నేతలు సోనియా గాందీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ తదితరులు పాలుపంచుకుంటారని రఘువీరా చెప్పారు.