: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలే ప్రచార వేదికలు!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునుపెన్నడూ కనపడనంతగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎమ్), కాంగ్రెస్, బీజేపీ సామాజిక మాధ్యమాల్లో వినూత్న రీతిలో, కొత్త కొత్త ఐడియాలతో యువతను ఆకర్షిస్తున్నాయి. కేవలం ఫేస్‌బుక్, ట్విట్టర్ మాత్రమే కాకుండా యూట్యూబ్, మెసేజింగ్ యాప్స్ వంటి అన్ని మాధ్యమాల్లోనూ ఎన్నికల బరిలోకి దిగుతున్న పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెగ్యులర్‌గా ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా సందేశాలు పోస్ట్ చేస్తుంటారు. ఇప్పటికే తన ఫేస్‌బుక్ పేజ్‌లో 16లక్షల లైక్‌లతో, 2.6లక్షల ట్విట్టర్ ఫాలోవర్స్ తో ఆమె ప్రజాదరణ పొందారు. " మీరు కూడా నాతో డిజిటల్ ప్రపంచం ద్వారా చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను" అంటూ ఈ మధ్యే మమతా బెనర్జీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. వాట్సాప్ ద్వారా ఆడియో, వీడియో పంపించడం.. యూట్యూబ్‌తో ప్రజలకు చేరువ కావడంపై తృణమూల్ కాంగ్రెస్ మరింత దృష్టి పెట్టింది. పేరుగాంచిన గాయకులతో తృణమూల్ కాంగ్రెస్ పాటలు పాడించుకొని వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దేశప్రయోజనాలు, గ్రామీణ వృత్తి, ఉపాధి కల్పన దృష్యా కంప్యూటర్‌ల విస్తృత వినియోగాన్ని బలంగా వ్యతిరేకించిన సీపీఐ(ఎమ్) కూడా నేడు ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా యువతను ఆకర్షిస్తోంది. మీడియా వాటి సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, సోషల్ మీడియాలో ఎవరి అకౌంట్‌కి వారే బాస్ కాబట్టి ప్రజలతో వాటి ద్వారా చర్చించే అవకాశం కలిసొస్తుందని సీపీఐ(ఎమ్) స్టేట్ సెక్రటేరియట్ మెంబర్ శ్రీదిప్ భట్టాచార్య వ్యాఖ్యానించారు.