: ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం... తెలుగు యువకుల దుర్మరణం
ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం నాడు జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కారు ప్రమాదంలో భీమవరానికి చెందిన మేడవరపు శేషగిరి, హైదరాబాద్ కు చెందిన సామల అరవింద్ కుమార్ అనే విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న హన్మకొండకు చెందిన దంపతులు నిశాంత్, ప్రియదర్శిని తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచీ బాధితుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా, తాము అక్కడికి వెళ్లాలంటే ఎవరిని సంప్రదించాలో తమకు తెలియడం లేదని, వీసా కూడా తమకు లేదని ప్రియదర్శిని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తమకు సాయమందించాలని వారు కోరుతున్నారు.