: బడ్జెట్ హనీమూన్ ముగిసింది... నష్టాల్లో మార్కెట్!


వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్ ముందుకు వచ్చిన నాటి నుంచి కొనసాగిన స్టాక్ మార్కెట్ లాభాల పర్వం ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు తోడు, దేశవాళీ ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బెంచ్ మార్క్ సూచికలు నష్టపోయాయి. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపు వద్ద మొదలైన సెన్సెక్స్ ట్రేడింగ్, ఆపై అమ్మకాల ఒత్తిడి కారణంగా 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆపై మధ్యాహ్నం తరువాత కొంత రికవరీ కనిపించినా నష్టాలు మాత్రం తప్పలేదు. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 170.62 పాయింట్లు పడిపోయి 0.69 శాతం నష్టంతో 24,623.34 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 45.65 పాయింట్లు పడిపోయి 0.61 శాతం నష్టంతో 7,486.15 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.32 శాతం, స్మాల్ క్యాప్ 0.18 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 18 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. కెయిర్న్ ఇండియా, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, ఆసియన్ పెయింట్స్, మారుతి సుజుకి తదితర కంపెనీలు లాభపడగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీహెచ్ఈఎల్, ఇన్ఫోసిస్, గెయిల్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,748 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,197 కంపెనీలు లాభాల్లోను, 1,401 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బుధవారం నాడు రూ. 92,04,800 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 91,64,974 కోట్లకు తగ్గింది.

  • Loading...

More Telugu News