: ఆ మహిళ ఎవరో తెలియదు!... పోలీసుల విచారణలో రావెల సుశీల్ పాత వాదన!


మద్యం మత్తులో మహిళ చేయి పట్టి కారులోకి లాక్కునేందుకు యత్నించాడన్న ఆరోపణలతో అరెస్టైన టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్ ను, అతని కారు డ్రైవర్ రమేశ్ ను నిన్న హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. చంచల్ గూడ్ జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు వారిద్దరికీ మెడికల్ చెకప్ చేయించి, ఆ తర్వాత నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో సుశీల్ ను పోలీసులు పలు కోణాల్లో విచారించారు. ఈ సందర్భంగా సుశీల్ గతంలో చేసిన పాత వాదననే పోలీసుల ముందు వినిపించినట్లు సమాచారం. కారులో తాను వెనక సీట్లో కూర్చుని ఉండగా, రమేశ్ కారు నడిపాడని చెప్పాడు. ఇంటి నుంచి తాజ్ బంజారా హోటల్ కు వెళుతున్న క్రమంలో మధ్యలో కిందకు దిగిన తనపై కొంతమంది దాడి చేశారని చెప్పాడు. అంతేకాక తనపై కేసు పెట్టిన మహిళ ఎవరో కూడా తనకు తెలియదని అతడు వాదించినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు నేడు కూడా సుశీల్ ను విచారించనున్న పోలీసులు నేటి సాయంత్రం తిరిగి జైలు అధికారులకు వారిని అప్పగించనున్నారు.

  • Loading...

More Telugu News