: మన దగ్గర ఆలోచనలే ఉన్నాయి... డబ్బులు లేవు: సీఎం చంద్రబాబు
మన దగ్గర ఆలోచనలే ఉన్నాయని, డబ్బులు లేవని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, పెట్టుబడులు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇచ్చామని, ఏడాది లోపు పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని అన్నారు. కృష్ణా-పెన్నా, వంశధార-నాగావళి లనూ అనుసంధానం చేస్తామని అన్నారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం పూర్తి కాకుంటే తీవ్ర ఇబ్బందులు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులపై చంద్రబాబు మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఎలాగైనా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్ష నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ సభ్యుల భాష, వారి మాటలతో జీవితంలో తానెన్నడూ బాధపడనంతగా బాధపడ్డానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.