: సీబీఐ ఎంక్వయిరీయే కాదు, ఏ ఎంక్వయిరీ వేయం: చంద్రబాబు
వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడు ప్రతిసారి సీబీఐ ఎంక్వయరీ, సీబీఐ ఎంక్వయరీ అంటున్నారు? ఏం తమాషాగా ఉందా? అని అడిగారు.' సీబీఐ ఎంక్వయరీ ద్వారా రాజధానిని అడ్డుకోవాలని కోరుకుంటున్నారు. ఆ ప్రాంతాన్ని తగలబెట్టేస్తున్నారు...బుద్ధుందా మీకు?' అని ఆయన మండిపడ్డారు. 'సీబీఐ ఎంక్వయిరీయే కాదు, ఏ ఎంక్వయిరీ వేయం. ఏం చేసుకుంటారో చేసుకోండ'ని ఆయన తెలిపారు. రైతులు, సామాన్యులు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వైఎస్సార్సీపీ నేతలు విద్వేషాలు రేపుతున్నారని ఆయన ఆరోపించారు. బాధ్యత లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. రాజధాని రాకూడదని, అక్కడుండే రైతులకు న్యాయం చేయకూడదని వైఎస్సార్సీపీ కోరుకుంటుందని ఆయన ఆరోపించారు. పద్ధతి లేని రాజకీయాలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.