: భారత్-పాక్ మ్యాచ్ వేదిక... ధర్మశాల నుంచి ఈడెన్ గార్డెన్స్ కు మార్పు?
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ లో భారత్, పాక్ జట్ల మధ్య ఈ నెల హైటెన్షన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు వేదికగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియాన్ని ఐసీసీ ఖరారు చేసింది. అయితే ధర్మశాలలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో వేదికను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీని కోరింది. అయితే తొలుత వేదికను మార్చే సమస్యే లేదని తేల్చిచెప్పిన ఐసీసీ, ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు సమాచారం. పాక్ ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ఈ మ్యాచ్ వేదికను ధర్మశాల నుంచి ఇతర ప్రాంతానికి మార్చే విషయాన్ని ఐసీసీ పరిశీలిస్తోందట. వేదిక మార్పు జరిగితే.. కోల్ కతాలోని ప్రఖ్యాత స్టేడియం ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరిగే అవకాశాలున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వేదిక మార్పుపై ఐసీసీ పరిశీలన నేపథ్యంలోనే నిన్న రాత్రి పాక్ నుంచి బయలుదేరాల్సిన ఆ దేశ జట్టు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అంతేకాక భారత్, పాక్ తో మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చే విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉంది. గతంలోనే దాయాదుల మధ్య జరిగిన పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిలిచింది. నేటి సాయంత్రంలోగా ఐసీసీ తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నట్లు సమాచారం.