: శాకాహారులైతే గుండెపోటు, బీపీ, షుగర్, క్యాన్సర్లు దూరం: కేంద్ర మంత్రి నడ్డా
మరింత ఆరోగ్యంగా ఎక్కువ కాలం పాటు జీవించాలంటే మాంసాహారాన్ని వదిలి శాకాహారానికి పరిమితం కావాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. శాకాహారంతో గుండె సంబంధిత వ్యాధులతో పాటు, బీపీ, మధుమేహం, క్యాన్సర్ లతో పాటు మూత్రపిండ వ్యాధులు దూరమవుతాయని అన్నారు. "వెజిటేరియన్ ఫుడ్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువగా శరీరంలోకి వెళుతుంది. జంతు సంబంధ ప్రొటీన్లు లభించే శాకాహారమూ అందుబాటులోనే ఉంది. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, సీ, ఈ విటమిన్లు వంటి మైక్రో న్యూట్రియంట్స్ శాకాహారంలో పుష్కలం" అని లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నడ్డా తెలిపారు. ఇటీవలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, క్యాన్సర్ పై జరిపిన అధ్యయనాన్ని ఆయన ప్రస్తావించారు. రెడ్ మీట్ వంటివి తినడం ద్వారా పేగు క్యాన్సర్ త్వరగా వస్తోందనడానికి సాక్ష్యాలు లభించాయని నడ్డా తెలిపారు.