: ఓరుగల్లులో టీఆర్ఎస్ కు షాకిచ్చిన రెబెల్స్!... ‘గులాబీ’ క్లీన్ స్వీప్ కు గండి!
ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లులో అధికార టీఆర్ఎస్ పార్టీకి రెబెల్ అభ్యర్థులు షాకిచ్చారు. ‘గులాబీ’ పార్టీకి క్లీన్ స్వీప్ విజయాన్ని అడ్డుకున్నారు. నేటి ఉదయం ప్రారంభమైన గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ సంపూర్ణ మెజారిటీ సాధించింది. కార్పొరేషన్ లోని మొత్తం 58 డివిజన్లలో టీఆర్ఎస్ 44 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ నాలుగు డివిజన్లలో, బీజేపీ ఓ స్థానంలో, మరో స్థానంలో సీపీఎం విజయం సాధించాయి. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన రెబెల్ అభ్యర్థులు 8 డివిజన్లలో విజయకేతనం ఎగురవేశారు. ఇండిపెండెంట్లుగా విజయం సాధించిన అభ్యర్థులంతా టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులేనని సమాచారం. రెబెల్ అభ్యర్థులు బరిలోకి దిగకుంటే... కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలకు ఆ ఆరు స్థానాలు కూడా దక్కేవి కావన్న విశ్లేషణలూ లేకపోలేదు. దీంతో రెబెల్ అభ్యర్థుల కారణంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ పార్టీకి క్లీన్ స్వీప్ విజయం దక్కలేదన్న వాదనా వినిపిస్తోంది.