: ‘జీరో’కు పడిపోయిన టీడీపీ గ్రాఫ్!... తాజా మునిసి‘పోల్స్’లో ఒక్క సీటునూ గెలవని వైనం!
కొత్త రాష్ట్రం తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందా? ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే, అదే నిజమని ఒప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న టీడీపీ, ఒక ఎంపీ సీటు (మల్కాజిగిరీ) ను కూడా గెలుచుకుంది. అయితే విజయం సాధించిన ఎమ్మెల్యేలను కూడా ఆ పార్టీ కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది. 15 మందిలో ఇప్పటికే 10 మంది టీఆర్ఎస్ లో చేరగా, మరో ఇద్దరు కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు దాదాపు సిద్ధమైపోయారు. ఈ నెల 11 న టీఆర్ఎస్ లో చేరుతున్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల వెంట ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా వెళుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే... టీడీపీకి తెలంగాణ అసెంబ్లీలో కేవలం ఇద్దరంటే ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. ఇక మొన్నటి గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 90కి పైగా డివిజన్లలో బరిలోకి దిగిన టీడీపీ... కేవలం ఒక్క డివిజన్ లో విజయం సాధించింది. తాజాగా గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పాలమూరు జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలో ఆ పార్టీ సింగిల్ సీటును కూడా దక్కించుకోలేకపోయింది. నేడు జరిగిన కౌంటింగ్ లో ఆ పార్టీ గ్రాఫ్ ‘జీరో’కు పడిపోయింది.