: ప్రారంభమైన సూర్య గ్రహణం... మూతపడ్డ ఆలయాలు
సూర్య గ్రహణం నేటి తెల్లవారుజామునే ప్రారంభమైంది. ఈ క్రమంలో నిన్న రాత్రే అన్ని ప్రధాన ఆలయాలు మూతపడిపోయాయి. మరికాసేపట్లో సూర్య గ్రహణం పూర్తి కాగానే ఆలయాలన్నీ ఒకదాని తర్వాత మరొకటిగా తెరచుకోనున్నాయి. సూర్య గ్రహణం పూర్తి కాగానే ఆయా ఆలయాల్లో సంప్రోక్షణ నిర్వహించనున్న సిబ్బంది, ఆ తర్వాత ఆలయాల తలుపులను తెరవనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు తిరుమల, బెజవాడ కనకదుర్గమ్మ, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, బాసర సరస్వతి మాత ఆలయం... తదితర అన్ని ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. మరోవైపు సూర్య గ్రహణాన్ని తిలకించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. నేటి ఉదయమే నిద్ర లేచి బయటకు వచ్చిన ప్రజలు భద్రతా ప్రమాణాలతో కూడిన కళ్లద్దాలతో సూర్య గ్రహణాన్ని వీక్షిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో కనిపించే ఈ సూర్య గ్రహణం నిడివి మాత్రం వేర్వేరుగా ఉంటోంది. హైదరాబాదులో 6.29 గంటలకు మొదలైన సూర్య గ్రహణం 6.47 గంటలకు ముగిసింది. అదే విశాఖలో 6.49 గంటల దాకా గ్రహణం కొనసాగింది.