: ముందు ఆ 43 వేల కోట్ల సంగతి తేల్చు: జగన్ కు ప్రత్తిపాటి సవాల్
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పత్రికలో తమపై అవాకులు చవాకులు రాస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న జగన్, సీబీఐ ఛార్జ్ షీటులో జగన్ అక్రమాలకు పాల్పడినట్టు పేర్కొందని అన్నారు. సీబీఐ చెప్పిన 43 వేల కోట్ల రూపాయలు, ప్రజాధనంతో పెట్టిన టీవీ ఛానెల్, పత్రికలను ప్రజలకు ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ కు ప్రభుత్వ సంస్థలపై విశ్వాసం లేదని ఆయన చెప్పారు. అయితే ఆరోపణలు చేయాలన్న లక్ష్యంతో ఆయన వాటి పేర్లను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. చేతిలో పత్రిక, టీవీ ఛానెల్ ఉన్నాయన్న గర్వంతో ఏదిపడితే అది రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలా అవాకులు చవాకులు రాయవద్దని ఆయన హితవు పలికారు. తమ ప్రతిష్ఠకు భంగం కలిగినందున నోటీసులు పంపుతున్నామని ఆయన అన్నారు.