: మేమున్నాం...భారత్, పాక్ మ్యాచ్ నిర్వహించండి: కేంద్రం
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో మ్యాచ్ నిర్వహణకు అడ్డంకులు తొలిగాయి. మార్చి 19న ధర్మశాల వేదికగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు టీట్వంటీ వరల్డ్ కప్ లో భాగంగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు భద్రతా ఏర్పాట్ల నిర్వహణ సాధ్యం కాదంటూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీబీ ఓ కమిటీని కూడా పంపింది. ఈ క్రమంలో కేంద్రం చొరవ తీసుకుని భద్రత బాధ్యతను స్వీకరించింది. ఈ విషయాన్ని బీసీసీఐ చెబుతూ, భద్రతా ఏర్పాట్లలో కేంద్రం పాలుపంచుకుంటుందని వివరించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ధర్మశాలలో మ్యాచ్ నిర్వహిస్తామని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దీంతో ఈ మ్యాచ్ కోసం ఎంతో కాలంగా వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు తాజా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆసియాకప్ సందర్భంగా బంగ్లాదేశ్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడించడంతో ఈ సారి పాకిస్థాన్ జట్టు ఆతిథ్య భారత జట్టును ఓడించేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో సొంత అభిమానుల ముందు ఓటమిపాలయ్యేందుకు భారత్ ఏమాత్రం సిద్ధంగా లేదు. దీంతో రెండు జట్ల మధ్య పసందైన క్రీడా విందు ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ఈ మ్యాచ్ పై ఇప్పుడే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.