: కవలపిల్లలే.. ఒకే తండ్రి మాత్రం కాదు... డీఎన్ఏ టెస్ట్ తో బయటపడిన విచిత్రం!
వియత్నాంలోని ఓ హాస్పిటల్‌లో కవలపిల్లలకు డీఎన్ఏ టెస్ట్ చేశారు. అయితే విచిత్రమయిన విషయం తెలిసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. నార్తెన్ వియత్నాంలోని, ఉత్తర హోవా బిన్హ్ ప్రావిన్స్ లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల ఈ కవలల్లో ఒకరు లావుగా, ఉంగరాల జుట్టుతో ఉండగా.. మరొకరు సన్నగా, తిన్నని జుట్టుతో ఉన్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు. వారికి పుట్టిన కవలల్లో ఒక శిశువు మాత్రమే వీరిద్దరికి జన్మించిందని డీఎన్ఏ టెస్ట్ ద్వారా తెలుసుకొని షాక్‌కు గురయ్యారు. మొదట హాస్పిటల్‌లో కవలలకు తల్లి జన్మనిచ్చినప్పుడు వారిలో ఒకరు మారి పోయి ఉంటారని భావించారు. కానీ ఇద్దరు కవలలూ ఒకే తల్లికి చెందిన వారని డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఇద్దరు పిల్లల్లో ఒక్కరు మాత్రం డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తండ్రికి జన్మించారని తేల్చిచెప్పారు. ఇలా పుట్టిన పిల్లల్ని బైపాటర్నల్ ట్విన్స్ (వేర్వేరు తండ్రులకు జన్మించిన కవలలు)గా వ్యవహరిస్తారు. ఇద్దరు పురుషులతో శారీరక సంబంధం కలిగి వుండే స్త్రీలకు ఇలాంటి కవలలు జన్మించే అవకాశం వుందని వైద్యులు తెలిపారు. చాలా అరుదుగా జరిగే ఇటువంటి సంఘటన వియత్నాంలో జరగడం ఇదే మొదటిసారి.