: మొట్టమొదటి వైమానిక మహిళా ఫైటర్ పైలట్స్ వచ్చేస్తున్నారు
భారత వైమానిక దళంలోకి భావన కాంత్, అవని చతుర్వేది, మోహన సింగ్ అనే ముగ్గురు మహిళలు మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్లుగా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా వైమానిక దళ చీఫ్ అరుణ్ రాహా మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 2016 జూన్ 18న తొలిబ్యాచ్ నుంచి ఈ ముగ్గురు మహిళలు వైమానికదళంలో చేరనున్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనను అంగీకరించినందుకు ఆయన కేంద్ర రక్షణ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. 2016 జూన్‌లో మహిళా ఫైటర్ పైలట్లు సైన్యంలో చేరనున్నారని ఆయన పేర్కొన్నారు. తర్వాత వారికి ఏడాది పాటు అత్యాధునికంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇప్పటికే మొదటి దశ శిక్షణ పూర్తి చేసుకున్న ఈ ముగ్గురు మహిళలు, ఇప్పుడు రెండవ దశలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేస్తున్నారని అరుణ్ రాహా అన్నారు. తరువాత వారు పురుషులతో సమాన హోదాతో ఈ రంగంలో రాణిస్తారని వ్యాఖ్యానించారు. భారత వైమానిక దళం ఇన్నాళ్లుగా మహిళలను ఫైటర్ పైలట్లుగా దింపడానికి వెనుకాడింది. ఆరోగ్యం, రక్షణ పరంగా మహిళలు ఎదుర్కునే సమస్యలే ఇందుకు కారణం. ఇప్పుడు భావన కాంత్, అవని చతుర్వేది, మోహన సింగ్ ల ఎంట్రీతో ఈ రంగంలోనూ మహిళా సాధికారత పొందవచ్చని భావిస్తున్నారు.