: మన టీమిండియా ఆటగాళ్ల ముద్దుపేర్లు ఇవిగో!
బోర్డింగు స్కూల్స్ లో చదువుకునే పిల్లలందరికీ నిక్ నేమ్స్ ఉంటాయి. అసలు పేర్ల కంటే వారు చేసే పనులు, వారు కనిపించే తీరు ఆధారంగా నిక్ నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. టీమిండియా ఆటగాళ్లు కూడా బోర్డింగ్ స్కూల్స్ విద్యార్థుల్లోలా నెలల తరబడి ఇంటికి దూరంగా గడుపుతారు. దీంతో వారికి కూడా నిక్ నేమ్స్ తో పిలుచుకునే అలవాటు ఉంది. టీట్వంటీ వరల్డ్ కప్ దగ్గరవుతున్న నేపథ్యంలో బీసీసీఐ వారి నిక్ నేమ్స్ తో ఓ వీడియో తయారు చేసింది. ఇందులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనను 'మహీ' అని పిలుస్తారని చెప్పగా, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనను 'చీకూ' అని పిలుస్తారని చెప్పాడు. చిన్నప్పుడు తన చెవులు పెద్దగా ఉండేవని, దానికి తోడు జుట్టు చిన్నగా కత్తిరించుకుని ఉండేవాడినని చెప్పాడు. దీంతో, 'చంపక్ కామిక్స్'లో 'చీకూ' అనే కుందేలులా ఉండేవాడినని కోచ్ అలా పిలిచేవారని, తరువాత అదే పేరు స్థిరపడిపోయిందని అన్నాడు. యువరాజ్ సింగ్ తనను 'యువీ' అని పిలుస్తారని చెప్పగా, హర్భజన్ సింగ్ తనను 'భజ్జీ' అంటారని చెప్పాడు. అజింక్యా రహానే తనను 'అజ్జూ' అంటారని వెల్లడించాడు. రవీంద్ర జడేజాను 'జడ్డూ' అని పిలుస్తారని అన్నాడు. రోహిత్ శర్మను సహచరులు 'షానా' అని పిలుస్తారు. ఇక సురేష్ రైనాను 'సోనూ' అనిపిలుస్తారని ఈ వీడియోలో వెల్లడించారు.