: దానికి పేరు ఏది పెట్టుకున్నా...మనం ఎలా ఉన్నామన్నదే ప్రధానం: గౌతమి
కమల్ హాసన్ తో కలిసి ఉండడాన్ని సహజీవనం అన్నా లేక ప్రేమలో ఉన్నాం అన్నా లేక భార్యాభర్తల బంధం అన్నా...ట్యాగ్ ఏదయినా కానీ తాము ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ప్రధానమని ప్రముఖ సినీ నటి గౌతమి చెప్పారు. ఓ టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, సమాజంలో కట్టుబాట్లు కాలమాన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను బట్టి మారుతున్నాయని అన్నారు. పలు సందర్భాల్లో అవి సవరణకు గురవుతున్నాయని, వాటి ప్రధాన లక్ష్యం ఏంటంటే జీవితాన్ని మరింత ఆనందంగా ఉండడమని చెప్పారు. ఇప్పుడు తాను సంతోషంగా ఉన్నానని అన్నారు. కేన్సర్ బారినపడి తీవ్ర మానసిక ఒత్తిడితో మరింత కుంగిపోయేవారితో పోలిస్తే...తాను చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నానని చెప్పారు. తన చుట్టూ తనను కంటికి రెప్పలా చూసుకునే వారు, తన సంక్షేమం కోరుకునే వారు ఉన్నారని ఆమె అన్నారు. అదే సగం మానసిక ధైర్యాన్ని ఇస్తుందని ఆమె తెలిపారు. విమెన్స్ డే అంటే కేవలం ఉద్యోగులు చేసుకునేది కాదని అన్నారు. ఉద్యోగులు, నిపుణుల కంటే హౌస్ బాధ్యతలు నిర్వర్తించడం కష్టమని ఆమె చెప్పారు. వాటిని సక్రమంగా నిర్వర్తించడం కత్తిమీద సామేనని ఆమె పేర్కొన్నారు.