: చొరబడ్డ ఉగ్రవాదులు ఎక్కడ?... ఐబీ, రా, ఎన్ఎస్ఏలతో రాజ్ నాథ్ అత్యవసర సమావేశం
పాకిస్థాన్ నుంచి లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రసంస్థలకు చెందిన 10 మంది గుజరాత్ లోని కచ్ సమీపంలో దేశంలోకి చొరబడ్డారని సమాచారం అందిన తరువాత, దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించగా, పరిస్థితిని సమీక్షించేందుకు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్), జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశమైన ఆయన, చొరబడ్డ ఉగ్రవాదులు ఎక్కడ దాగున్నారన్న విషయమై మరింతగా శోధించాలని, వారిని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయాలని సూచించారు. ప్రముఖ శైవక్షేత్రాల్లో భద్రతను సమీక్షించారు. మహాశివరాత్రి వేళ, భక్తులు అధికంగా ఉన్న ప్రాంతాలపై దాడులు జరగవచ్చన్న అనుమానాలతో గుజరాత్ లోని సోమనాథ్ తదితర ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా దళాలు అణువణువూ సోదాలు జరుపుతున్నాయి.