: భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ లో అగ్నిప్రమాదం
విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గోవా ప్రాంతంలో అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విరాట్ ఉన్న వేళ, షిప్ బాయిలర్ రూము నుంచి ఆవిరి లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వెంటనే సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ నలుగురు ఉద్యోగులు ఉన్నారని, వారిలో చీఫ్ ఇంజనీరింగ్ మెకానిక్ ఆషూ సింగ్ మరణించారని అధికారులు తెలిపారు. మిగతా ముగ్గురూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారికి ప్రాణాపాయం లేదని అన్నారు. జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఐఎన్ఎస్ విరాట్, దాదాపు 60 సంవత్సరాలుగా సేవలందిస్తోంది. ఈ సంవత్సరంలో రిటైర్ కానున్న నౌకను, విశాఖ తీరంలో టూరిజం అభివృద్ధి కోసం నిలపాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.