: మమతా... మజాకా?... 294 మంది అభ్యర్థుల పేర్లనూ ప్రకటించేసిన తృణమూల్ అధినేత్రి!
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయగానే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, తమ పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించేశారు. మిగతా రాష్ట్రాల్లో మిగతా పార్టీలన్నీ ఎవరిని బరిలోకి దించాలన్న ఆలోచనలో కూడా లేని సమయంలో మమత ఈ అడుగు వేయడం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. పశ్చిమ బెంగాల్ లోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకూ, అభ్యర్థులు వీరేనని మమతా బెనర్జీ వెల్లడించారు. అంటే, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే, పోటీలో నిలిచేవారి జాబితాను మమత సిద్ధం చేసుకుని పెట్టుకున్నారన్న మాట. ప్రత్యర్థికి ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా ఎత్తులు వేస్తున్న మమతకే మరోసారి పీఠం దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.