: శివోహం!... మహా శివరాత్రి పర్వదినాన శివాలయాలకు పోటెత్తిన భక్తజనం
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. నిన్న సాయంత్రానికే ఆయా ఆలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో శివ పార్వతులను దర్శించుకుంటున్నారు. లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో శివాలయాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాల్లో స్వామి వారి దర్శనం ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి దాదాపు 2 లక్షల మంది చేరుకున్నట్లు సమాచారం. భక్తుల తాకిడితో శ్రీశైల క్షేత్రం రద్దీగా మారింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక ఈ రెండు ఆలయాలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేములవాడ, కాళేశ్వరం, ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు తదితర ఆలయాలన్నీ కూడా శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి.