: జైలులో కవితలు రాసిన సంజయ్ దత్... త్వరలో వాటికి పుస్తకరూపం!
జైలు జీవితం నేర్పిన పాఠాలను ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కవితల రూపంలో ప్రజల ముందుకు తీసుకురానున్నాడు. సత్ప్రవర్తన కారణంగా శిక్షాకాలం కంటే ముందే విడుదలైన సంజయ్ దత్ జైలులో ఉన్నప్పుడు పేపర్ బ్యాగులు తయారు చేయడంతో పాటు రేడియో జాకీగా కూడా పనిచేశాడు. వీటి నుంచి విరామం లభించినప్పుడు పెన్ను కదిలించాడు. సుమారు 100 కవితలను సంజయ్ దత్ రాశాడు. జైసన్ ఖురేషీ, సమీర్ హింగేల్ ల సహాయంతో తన జీవిత విశేషాలను మరో 400 కవితలుగా మలిచాడు. ఇలా రాసిన ఈ 500 కవితలను 'సలాఖే' పేరుతో పుస్తకంగా తీసుకురానున్నానని సంజూబాబా చెప్పాడు. వీటిని ఇప్పటికే కొందరు ప్రచురణకర్తలకు చూపించానని, వారి సహకారంతో వీటిని పుస్తకంగా మలచనున్నానని సంజయ్ దత్ తెలిపాడు. ఈ పుస్తకాన్ని విడుదల చేసిన తరువాత సినిమాల్లో నటిస్తానని సంజయ్ దత్ చెప్పాడు.