: సుశీల్ కేసులో ఎవరి ప్రోద్బలమూ లేదు: డీసీపీ వెంకటేశ్వరరావు
తాము ఫిర్యాదు ఆధారంగానే రావెల సుశీల్, అతని డ్రైవరుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని, దీనిపై ఎవరి బలవంతం లేదని డీసీపీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, తన చెయ్యి పట్టుకుని లాగాడని, ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని, విచారణ జరుపుతున్నామని, నిజాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన రోజున గాయాలతో ఉన్న రమేష్ ను, రావెల సుశీల్ స్వయంగా కారులో స్టేషనుకు తీసుకువచ్చారని వెల్లడించిన వెంకటేశ్వరరావు, ఆ వెంటనే చికిత్స నిమిత్తం స్టార్ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు. ఆ తరువాతనే బాధిత మహిళ ఫిర్యాదు అందిందని అన్నారు. ఎవరి ఆరోపణలతోనూ తమకు సంబంధం లేదని, ఈ కేసులో చట్ట ప్రకారం ముందుకు సాగుతున్నామని వివరించారు.