: ఒకటి అభేద్యం...మరొకటి సంచలనాలకు మారుపేరు... మరి ఆసియా కప్పెవరిది?


ఆసియాకప్ టైటిల్ పోరుకు మరో 24 గంటల సమయం ఉంది. ఈ పోరులో ఆతిథ్య బంగ్లాదేశ్ తో భారత జట్టు తలపడనుంది. తమ జట్టు ఫైనల్ కు చేరడంతో బంగ్లాదేశీయుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పాకిస్థాన్, శ్రీలంక వంటి బలమైన జట్లను ఓడించి మరీ ఫైనల్ చేరడంతో బంగ్లా అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. బంగ్లాదేశ్ ఆడిన అన్ని మ్యాచ్ లకు స్టేడియం నిండిపోవడం విశేషం. ఈ నేపథ్యంలో రేపు ఫైనల్ మ్యాచ్ టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ అయినప్పటికీ బంగ్లా జట్టుకు పిచ్ కొట్టినపిండి. సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్ జట్టుకు స్వదేశంలో సొంత అభిమానుల ముందు ఆడనుండడం అదనపు బలం. దీంతో రేపటి మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ టీట్వంటీ జట్టుగా పేరొందింది. జట్టులో 8వ డౌన్ వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉండడం టీమిండియా బలం. అదే సమయంలో టీమిండియా టాప్ ఆర్డర్ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సమర్థులు, ఇందులో నలుగురు ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ధావన్ కు పిచ్ పై పట్టు దొరికితే విధ్వంసమేనన్న సంగతి తెలిసిందే. ఇక మిడిల్ ఆర్డర్ లో మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య విరుచుకుపడడంలో సిద్ధహస్తులైతే, చివర్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమదైనశైలిలో బ్యాట్ ఝుళిపించడానికి సదా సిద్ధంగా ఉంటారు. ఇక బౌలింగ్ లో ఆశిష్ నెహ్రా తొలి వికెట్ తీసి దిశానిర్దేశం చేస్తుండగా, బుమ్రా, హార్దిక్ పాండ్య అతని దారిలో నడుస్తూ కీలక సమయాల్లో రాణిస్తున్నారు. బుమ్రా, పాండ్య కీలక సమయాల్లో యార్కర్లు విసురుతూ ఆకట్టుకుంటున్నారు. అశ్విన్, జడేజాల గురించి ఎంత చెప్పినా తక్కువే. దీంతో టీమిండియా గెలుపు నల్లేరుపై నడక అని క్రీడాపండితులు పేర్కొంటున్నారు. అదే సమయంలో టీమిండియా బ్యాట్స్ మన్ కు బంగ్లా బౌలర్లు మెర్తజా, అమీన్ హసన్, తస్కిన్ అహ్మద్, షకిబల్ హసన్ నుంచి ముప్పు ఉండగా, టీమిండియా బౌలర్లకు మెర్తజా, షబ్బీర్ రెహ్మాన్, మహ్మద్ మిథున్, సౌమ్య సర్కార్, షకిబల్ హసన్ నుంచి ముప్పు ఉంది. అయితే భారత జట్టు అనుభవం ముందు సంచలనాల బంగ్లా నిలుస్తుందా? అనేది కాస్త అనుమానమే. ఏమైనా, రేపటి మ్యాచ్ క్రీడాభిమానులకు పసందైన విందు అందిస్తుందనడంలో సందేహం మాత్రం లేదు!

  • Loading...

More Telugu News