: పరారీలో రావెల సుశీల్?... అరెస్ట్ కోసం రంగంలోకి ప్రత్యేక బృందాలు
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల్ కిశోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా? అంటే, అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. మద్యం మత్తు తలకెక్కిన నేపథ్యంలో ఓ వివాహిత చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు యత్నించిన ఘటనలో రావెల సుశీల్ తో పాటు అతడి కారు డ్రైవర్ రమేశ్ పై బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి కాస్త ఆలస్యంగా స్పందించిన పోలీసులు నేటి ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ లోని రావెల ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వేగంగా చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలించిన సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. సుశీల్ ఆచూకీ లభించని నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు హైదారాబాదు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ కేసులో ఏ ఒక్కరిని తప్పించే యత్నం చేయలేదని ప్రకటించిన డీసీపీ... సుశీల్ ను తప్పనిసరిగా అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఇక ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు రావెల సుశీల్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.