: పింఛను అక్కర్లేదయ్యా!... చంద్రబాబును విస్మయపరచిన 80 ఏళ్ల వృద్ధురాలు!


గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ పర్యటనలో నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి వింత అనుభవం ఎదురైంది. తనను కలిసేవారు అది కావాలనో, ఇది కావాలనో అడగడమే తప్పించి... ప్రభుత్వం నుంచి అందుతున్న పింఛనును తనకు కాకుండా అవసరం ఉన్న నిరుపేదలకు అందిస్తే బాగుంటుందని స్వయంగా ఓ వృద్ధురాలు చెప్పడంతో చంద్రబాబు ఆశ్చర్యానికి లోనయ్యారు. వృద్ధురాలి సూచనకు స్పందించిన చంద్రబాబు ఆమె నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని మెచ్చుకున్నారు. నిన్న కోటప్పకొండకు వెళ్లిన సందర్భంగా చంద్రబాబును 80 ఏళ్ల వృద్ధురాలు ఆప్యాయంగా పలుకరించారు. అంతేకాక మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. చంద్రబాబు: అమ్మా... నీకు పింఛను అందుతున్నదా? వృద్ధురాలు: నాకు పింఛను అక్కర్లేదయ్యా చంద్రబాబు: ఎందుకనమ్మా? వృద్ధురాలు: నన్ను నా కూతురు, కుమారులు బాగా చూసుకుంటారు. పింఛను పేదలకు అందితే సంతోషిస్తా చంద్రబాబు: అమ్మా... నీ నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వృద్ధురాలు: చల్లగా ఉండయ్యా ఆ తర్వాత తనను మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన వృద్ధురాలిని చంద్రబాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ తర్వాత జరిగిన సభలో చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News