: రాజధానికి ఎంత భూమి కావాలో నీకేం తెలుసు?: ముద్రగడను ప్రశ్నించిన మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎంత భూమి కావాలో చెప్పడానికి ముద్రగడ ఎవరని మంత్రి నారాయణ ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, భూసేకరణకు అంగీకరించిన రైతులకు లేని బాధ ముద్రగడకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అసలు రాజధానికి ఎంత భూమి కావాలో ఆయనకు తెలుసా? అని ఆయన నిలదీశారు. రాజధానికి 33,000 ఎకరాలు కాదు, 55,000 ఎకరాల నుంచి 1,00,000 ఎకరాలు కావాలని ఆయన అన్నారు. రాయ్ పూర్, గాంధీనగర్ లకు వెళ్లి, అక్కడ నిర్మించిన రాజధానులను చూసి మాట్లాడాలని ఆయన సూచించారు. కావాలంటే రాజధాని ప్రాంతంలో ముద్రగడ పర్యటించి తెలుసుకోవాలని, భూసేకరణపై రైతులందరూ ఆనందంగా ఉన్నారని ఆయన చెప్పారు. రాజధాని అంటే కేవలం సెక్రటేరియట్ మాత్రమే కాదని ఆయన చెప్పారు. తాను కూడా కాపునేనని చెప్పిన నారాయణ...ముద్రగడ కాపు నేత అని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. కాపులకు ప్రభుత్వం చేసిన చర్యలపై ముద్రగడతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, తనతో బహిరంగ చర్చకు వచ్చేందుకు సిద్ధమా? అని ఆయన సవాలు విసిరారు.