: చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే ముద్రగడ దీక్ష: తోట త్రిమూర్తులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఇబ్బంది పెట్టేందుకే ముద్రగడ పద్మనాభం మళ్లీ దీక్ష అంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆరోపించారు. వైజాగ్ లో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నో పార్టీలు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పాయని అన్నారు. 40 ఏళ్ల కాపు రిజర్వేషన్ ఉద్యమంలో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని ఎప్పుడూ చెప్పలేదని చెప్పారు. 2014 ఎన్నికల్లో మాత్రం కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చెబుతూ, మేనిఫెస్టోలో పెట్టారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన సమస్యల వల్ల అది అమలు చేయడంలో కాస్త జాప్యం జరిగిందని ఆయన చెప్పారు. కాపు నేతగా ఆయన చెప్పిన మాటలను తానెప్పుడైనా మర్చిపోయానేమో కానీ, చంద్రబాబునాయుడు మాత్రం ఇచ్చిన మాటను మరువలేదని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలా? అని ఆయన ఆలోచించారని చెప్పారు. ప్రస్తుతం కాపు ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. కాపు ఉద్యమాన్ని రాజకీయం చేసి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబుపై ముద్రగడ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని ఆయన అన్నారు. నెల రోజుల్లో మళ్లీ తిరుగుబాటు చేస్తామని హెచ్చరించడం ఆక్షేపణీయమని ఆయన తెలిపారు. వ్యక్తిగత ఎజెండాతో ముద్రగడ ముందుకు సాగడంతో కాపులకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.